డైలీ భారత్, హైదరాబాద్: కామాటిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడికి గౌరవ XII అదనపు సెషన్స్ న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.
2021లో నమోదైన ఈ కేసులో, ఆన్‌లైన్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై కామాటిపుర పోలీసులు సెక్షన్ 376(3) IPC మరియు పోక్సో చట్టం సెక్షన్ 5(l) r/w 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.
ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, దర్యాప్తు అధికారి, లీగల్ సపోర్ట్ అధికారులు మరియు కోర్టు విధుల్లో పాల్గొన్న సిబ్బందిని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపిఎస్ అభినందించారు.