ఒకే రోజు 86 మందికి కోర్టు శిక్షలు
08 మందికి ఒక రోజు జైలు శిక్ష, 01 వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
మొత్తం ₹1,22,500/- భారీ జరిమానా విధింపు
“మీ ప్రాణం – మీ కుటుంబానికి అమూల్యం… నిబంధనలు పాటించండి” – జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడినే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తులను పోలీసులు పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుల తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి మొత్తం 86 మందికి వివిధ రకాల శిక్షలు విధించారు. వీరిలో 08 మందికి ఒక రోజు జైలు శిక్ష, 01 వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా వారికి కలిపి ₹1,22,500/- రూపాయల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం మాత్రమే కాకుండా అనేక కుటుంబాల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం చేసే తప్పిదం జీవితాంతం బాధకు కారణం కావొచ్చని హెచ్చరించారు.
ప్రజలందరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, మీ భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.