డైలీ భారత్, హైదరాబాద్: వివాహితను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారనే ఆరోపణలపై ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) బాలస్వామిని సైదాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
పరిచయం.. డీఐగా ఉన్న కాలంలోనే
నిందితుడు బాలస్వామి గతంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వివాహితతో పరిచయం ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ భర్త తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో సహాయం చేసే నెపంతో దగ్గరయ్యారని ఆరోపణ.
"నీ భర్త ఎక్కువ రోజులు బతకడు".. మాయమాటలతో వల
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, "నీ భర్త ఎక్కువ రోజులు బతకడు.. అతను చనిపోయాక నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను" అంటూ నమ్మించి 2017 నుంచి పెళ్లి నెపంతో శారీరక సంబంధం కొనసాగించారని ఆరోపించారు. భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ కాలం వెళ్లదీశారని తెలిపారు.
బయటపడ్డ నిజాలు.. విడాకులంటూ మరో డ్రామా!
2024లో బాలస్వామికి అప్పటికే వివాహమై భార్య, పిల్లలు ఉన్న విషయం తెలియడంతో బాధితురాలు నిలదీసినట్లు ఫిర్యాదులో ఉంది. అయితే తన భార్యతో మనస్పర్థలు ఉన్నాయని, విడాకులు తీసుకున్నానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించారని ఆరోపణ.
ముఖం చాటేయడంతో ఫిర్యాదు
2025 జనవరి నుంచి పెళ్లి ప్రస్తావన తేగానే దూరం పెట్టడం మొదలుపెట్టారని, పెళ్లి పేరుతో మోసం చేశారని గ్రహించి బాధితురాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.
కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 349/2026 కింద కేసు నమోదు చేసి, ప్రస్తుతం ఖైరతాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డీఐని అరెస్ట్ చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు కొనసాగుతోంది.
పై వివరాలు బాధితురాలి ఫిర్యాదు, పోలీసు వర్గాల సమాచారం మేరకు.
దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉంది.