| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ ముఠాలో పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ ముఠాలో పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్ట్

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరుస ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ముఠాలో కీలక నిందితుడి పట్టివేత

నిందితుడు తక్ షంషేర్ సింగ్‌ను పట్టుకున్న భిక్నూర్ పోలీసులు

విచారణలో 54 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడి

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 73 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైనట్లు గుర్తింపు

చోరీలకు ఉపయోగించిన పరికరాలు, నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం స్వాధీనం

54 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడి

వివరాలు వెల్లడించిన కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠాలో పరారీలో ఉన్న మరో నిందితుడిని భిక్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తక్ షంషేర్ సింగ్‌ను 10.10.2026న భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నేరానికి పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు కామారెడ్డి డీఎస్పీ శ్రీ ఎస్. మధుసూదన్ తెలిపారు.

గతంలో ముగ్గురి అరెస్ట్ – పరారీలో ఉన్న నిందితుడి పట్టివేత

గతంలో భిక్నూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 340/2026 కేసులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్జీత్ సింగ్ చతుర్ సింగ్ తక్, రూప్ సింగ్ చతుర్ సింగ్ తక్, లఖన్ చతుర్ సింగ్ తక్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, 11.09.2026న కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడైన తక్ షంషేర్ సింగ్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తాజాగా పట్టుకున్నారు.

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 54 చోరీ కేసుల్లో ప్రమేయం

విచారణలో నిందితుడు తక్ షంషేర్ సింగ్, సత్నామ్ సింగ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని భిక్నూర్, రాజంపేట, జుక్కల్, పెద్దకొడపగల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులతో పాటు మెదక్ జిల్లాలోని చేగుంట, నర్సింగి, నిజాంపేట, శంకరంపేట, శివంపేట, తూప్రాన్, వెల్దుర్తి, రామాయంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది.

నిందితుడు మొత్తం 54 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 73 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకుంటూ తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చోరీ పరికరాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి రెండు ఆక్సర్ బ్లేడ్లు, రెండు కటింగ్ ప్లయర్లు, రెండు పానలు, ఒక కట్టర్, ఒక సైకిల్ ట్యూబుతో పాటు నంబర్ ప్లేట్ లేని ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్, భిక్నూర్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. అనిల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఏఎస్ఐ వెంకట్రావు, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, శ్రీకాంత్, కిషన్ గౌడ్, శేఖర్ ఈ ఆపరేషన్‌లో పాల్గొని నిందితుడిని పట్టుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు, విద్యుత్ పరికరాల చోరీలు లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు

Previous కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల ఎండు గంజాయి పట్టివేత
Next బిబిపేటలో బతుకమ్మ సంబురాలు... ఆటపాటలతో హోరెత్తించిన తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ
ADVERTISEMENT