| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Misc

రైతు బిడ్డకు ఉద్యోగం రాగానే మొదట మారేది భాష, తర్వాత వేషం, చివరికి తల్లిదండ్రులే!

రైతు బిడ్డకు ఉద్యోగం రాగానే మొదట మారేది భాష, తర్వాత వేషం, చివరికి తల్లిదండ్రులే!

డైలీ భారత్ స్పెషల్: పొలం గట్ల మీద చెమట చుక్కలతో నాన్న పండించిన పంటను అమ్మి, తినకుండా దాచిన డబ్బుతో కొడుకుని చదివించాడు. ఆ కొడుకు పట్నంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాడు. నెలకు లక్ష రూపాయల జీతం.

ఇంటికి మొదటిసారి కారులో వచ్చాడు. ఊరంతా చూసింది. తండ్రి కళ్ళలో ఆనందం. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

ఎందుకంటే.. ఉద్యోగంతో పాటు కొడుకులో చాలా మార్పులు వచ్చాయి.

మొదట మారేది భాష..

చిన్నప్పుడు "అమ్మా.. అన్నం పెట్టు" అని అడిగిన నోరే.. ఇప్పుడు "Mom, What is this food? I need diet food" అంటోంది.

పొలంలో పనిచేసే నాన్నతో ఫోన్లో "ఏందిరా నాన్నా" అని మాట్లాడిన కొడుకే.. ఇప్పుడు "Dad, I”m busy in a meeting, I”ll call you later" అంటున్నాడు.

తన తల్లిదండ్రులతో తెలుగులో మాట్లాడితే తన ఫ్రెండ్స్ ముందు చిన్నతనం అనుకుంటున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడటం గొప్ప అనుకుంటున్నాడు. కానీ వాడు మాట్లాడే ఇంగ్లీష్ వెనుక.. నాన్న అమ్మిన 5 ఎకరాల పంట ఉందని మర్చిపోయాడు.

రెండోది మారేది వేషం..

ఊర్లో ఉన్నప్పుడు లుంగీ కట్టిన నాన్నను చూసి గర్వపడిన కొడుకే.. ఇప్పుడు నాన్న లుంగీతో హైదరాబాద్ లోని తన ఫ్లాట్ కు వస్తే.. "నాన్నా.. అలా రాకు, ఇక్కడ అందరూ చూస్తారు" అంటున్నాడు.

తల్లి తలలో పూలు పెట్టుకొని, చేతికి గాజులు వేసుకొని ఉంటే ముద్దుగా ఉందన్న కొడుకే.. ఇప్పుడు "అమ్మా.. కొంచెం మోడ్రన్ గా ఉండు" అంటున్నాడు.

పండగకు ఇంటికి వస్తే.. పాత బట్టల్లో ఉన్న అమ్మా నాన్నలతో ఫోటో దిగడానికి సిగ్గుపడుతున్నాడు.

చివరికి మార్చేది తల్లిదండ్రులనే..

ఇదే అత్యంత బాధాకరం.

"మా అమ్మకు ఏమీ తెలియదు, మా నాన్నకు సిటీ కల్చర్ తెలియదు" అని ఫ్రెండ్స్ తో చెప్పడం మొదలు పెట్టాడు.

పెళ్లి విషయంలో.. "నాకు పల్లెటూరి అమ్మాయి వద్దు, చదువుకున్న అమ్మాయి కావాలి" అంటున్నాడు. కానీ తనను చదివించింది ఆ పల్లెటూరి అమ్మే అని మర్చిపోయాడు.

తల్లిదండ్రులు తన ఇంటికి వస్తే.. "2 రోజుల్లో వెళ్లిపోండి, నాకు లీవ్ లేదు" అంటున్నాడు. కానీ తన ఫ్రెండ్స్ వస్తే వారం రోజులు పార్టీ చేసుకుంటున్నాడు.

ఒక్కసారి ఆలోచించు కొడుకా..

నువ్వు ఈరోజు వేసుకున్న బ్రాండెడ్ షర్ట్ వెనుక.. నాన్న 40 డిగ్రీల ఎండలో పొలం దున్నిన కష్టం ఉంది.

నువ్వు ఈరోజు మాట్లాడుతున్న ఇంగ్లీష్ వెనుక.. అమ్మ కూలి పనులు చేసి కట్టిన ఫీజు ఉంది.

నువ్వు ఈరోజు ఉంటున్న AC ఫ్లాట్ వెనుక.. వాళ్లు పూరి గుడిసెలో పడుకున్న రాత్రులు ఉన్నాయి.

నువ్వు మారిపోయావు.. కానీ వాళ్లు మారలేదు. నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నారు.

నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా.. నువ్వు ఆ రైతు బిడ్డవే. ఆ పల్లెటూరి తల్లి కొడుకువే. ఇది మర్చిపోతే.. నువ్వు ఎంత సంపాదించినా.. నువ్వు దరిద్రుడివే.

ఈరోజు ఒక్కసారి నాన్నకు ఫోన్ చేసి "నాన్నా.. నేను నీ కొడుకునే" అని చెప్పు. అమ్మను "అమ్మా" అని ప్రేమగా పిలువు. అంతకు మించిన జీతం ఈ ప్రపంచంలో లేదు.

అందరూ ఇలాగే ఉన్నారు అని చెప్పి అనలేము కొంతమందిలో ఈ మార్పు జరిగింది. కానీ ఆ కొంతమందిని చూసైనా మిగతావారు మారాలి

Previous సిరిసిల్ల టీచర్లకు హైదరాబాద్‌లో టీ-సాట్ శిక్షణ... ప్రశంసాపత్రాల ప్రదానం
ADVERTISEMENT