| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Misc

70% పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే

70% పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే

డైలీ భారత్, వినుకొండ: తల్లిదండ్రులకు చేతులు జోడించి చేసుకుంటున్న విన్నపం అంటూ వినుకొండ సీఐగా పనిచేస్తున్న సింగిరేసు సాంబశివరావు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు.

పిల్లలకి బడిలో భయం లేదు.. ఇంట్లో భయం లేదు..

కొట్టొద్దు, తిట్టొద్దు, బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేదని అడగొద్దు.. చదవాలని, హోం వర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. 5వ తరగతి నుండే కటింగ్ స్టైళ్లు, చినిగిన జీన్స్, గోడల మీద కూర్చోవడం, వెళ్లేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం చేస్తున్నారని పేర్కొన్నారు.

"అరేయ్ సార్ వస్తున్నారురా!" అంటే "వస్తే రానియ్" అనే పరిస్థితి నెలకొందని, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమీ కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది

గురువంటే భయం లేదు, గౌరవం లేదు.. ఇక చదువు, సంస్కారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, ప్రేమతో చెప్పాలట.. ఇదెలా సాధ్యమని నిలదీశారు.

మంచి నేర్పేవాళ్లకి (స్కూల్లో) హక్కులుండవు.. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం, వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం అని పేర్కొన్నారు.

70% పిల్లలు ఇలానే..

ఇప్పటి తరం 70% పిల్లలు తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం చేయమంటే తుడవరు.. మంచినీళ్లు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్లమంటే వెళ్లరని, లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరని తెలిపారు.

20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదని, బట్టలు పద్ధతిగా ఉండాలంటే కోపం వస్తుందని, కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు పోతున్నారని అన్నారు.

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60% కారణమైతే, 40% మాత్రం తల్లిదండ్రులే కారణమని స్పష్టం చేశారు. గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుందని హెచ్చరించారు.

పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, కుటుంబ బంధాలు, దైవభక్తి, దేశభక్తి వంటివి చిన్న వయసులోనే అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.

భావితరాల పిల్లల కోసం, పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదని ఆయన తన లేఖను ముగించారు.


Source : social media

Previous రామారెడ్డి PHC ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై జిల్లా అధికారి డా. వెంకట్ ఆరా
ADVERTISEMENT