డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా PACSలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా రైతులకు అన్ని రకాల సేవలను అందించే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు.
రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇల్యాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బీబీపేట్ సర్పంచ్ సాత్విక సాయి, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ DCMS చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.