కామారెడ్డి (డైలీ భారత్): ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి-44 వెంట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
టీజీ సేఫ్‌కు చెందిన 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 ఆహార సంస్థలను తనిఖీ చేశాయి. అందులో కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-44 వెంట 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా జైకా మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ (బస్వాపూర్), ది మాల్గుడి రెస్టారెంట్ (అంతంపల్లి, భిక్నూర్), వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ (భిక్నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్ (అడ్లూర్), లుఫ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ (అడ్లూర్ ఎల్లారెడ్డి), తాజ్ ఫ్యామిలీ దాబా (సదాశివనగర్) లలో పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల సక్రమ నిల్వ లేకపోవడం, కీటకాల ఉనికి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వంటగది అపరిశుభ్రత వంటి తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో ఆయా సంస్థల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
శ్రీ ఆధ్య గ్రాండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ (జంగంపల్లి) కు షోకాజ్ నోటీసు జారీ చేసి జరిమానా విధింపునకు చర్యలు చేపట్టగా, ఆర్.ఎస్. గ్రాండ్ రెస్టారెంట్ (నర్సన్నపల్లె)కు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు.
మూడు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించారు. మొత్తం 9 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేయగా, 6 సంస్థలకు షోకాజ్ నోటీసులు, 5 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో కామారెడ్డి జిల్లాలోనే 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి.
ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ అధికారులు హెచ్చరించారు.