విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్ష సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి సర్కిల్ పరిధిలోని 33/11మాచారెడ్డి సబ్‌స్టేషన్,132 కెవి , 33/11 దోమకొండ సబ్‌స్టేషన్ టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ కొత్తగా 132 కెవి మాచారెడ్డి సబ్‌స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ లు , కొత్త ఈ హెచ్ టి లైన్లు రాబోతున్నాయని వివరించారు. మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని , అవసరం మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
అధికారులతో మాట్లాడతూ సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ లోడ్ పరిస్థితి, ఫీడర్ల పనితీరు, వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన సాంకేతిక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ లోడ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట్ల లోడ్ బ్యాలెన్సింగ్ చేపట్టాలని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే ఫీడర్లపై లోడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చోట్ల అదనపు సామర్థ్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సబ్‌స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్లు, ఇతర విద్యుత్ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా సాంకేతిక లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వినియోగదారులకు నాణ్యమైన, స్థిరమైన వోల్టేజ్‌తో కూడిన విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వినియోగదారుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్పష్టం చేశారు.
సీఎండీ వెంట డి.ఈ టెక్నీకల్ వై . విజయసారధి , డి.ఈ కామారెడ్డి నందకుమార్ ఎం ఏ .డి.ఈ నరేష్ తదితరులు ఉన్నారు .