| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయుడి భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి : గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్

ఉపాధ్యాయుడి భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి : గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్

డైలీ భారత్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రామన్నపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజు నివాసముంటున్న ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి అదనపు నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే భూకబ్జాలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు.

అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులు ఒకటి కంటే ఎక్కువసార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆయన తీసుకోకపోవడంతో, చివరకు ఇంటి గోడకు నోటీసు అతికించి వెళ్లారని తెలిపారు. పంచాయతీ నోటీసుల్లోనూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు.

ఈ వ్యవహారంపై గత సెప్టెంబర్ 25న జిల్లా విద్యాశాఖాధికారి (DEO)తో పాటు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు బాబు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

భవిష్యత్ తరాల అవసరాల కోసం, పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఉపయోగపడే ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలని కోరారు. తక్షణమే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.


 #Sircilla #Konaraopet

Previous వ్యక్తిగత విషాదం నుంచి సమాజ సేవకు... ప్రదీప్తి ఫౌండేషన్ ఆదర్శం
ADVERTISEMENT