ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలి
సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు
రోడ్ సేఫ్టీపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ
డైలీ భారత్, సిరిసిల్ల : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ విద్యార్థులతో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించిన, సిట్ బెల్ట్ పెట్టుకున్న వారికి విద్యార్థులు పువ్వులను అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ ఎక్కువ మంది అవగాహనా లోపం, అధిక వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ , ట్రిపుల్ డ్రైవింగ్ , ఓవర్ టేకింగ్ తదితర తప్పుల వల్ల ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆకునూరీ వెంకటేష్ తోపాటు ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.