Posted on 2026-08-02 09:35:33
డైలీ భారత్, సికింద్రాబాద్: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ... భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగియగా, ప్రస్తుతం శ్రీ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే "ఫేషియల్ రికగ్నిషన్" సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను "థ్రెషోల్డ్ మ్యాపింగ్" ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్యల ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >