| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

డైలీ భారత్, విశాఖపట్నం: వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా గణేషుడి విగ్రహాల తయారీ ప్రక్రియ మొదలైంది. వీధివీధిలో.. వాడవాడలా వివిధ రూపాలలో వినాయకుడు కొలువు తీరనున్నాడు.

ఈ క్రమంలోనే విశాఖపట్నంలో వినూత్న శైలిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాజువాక ప్రాంతంలోని శ్రీనగర్‌లో కోటికి పైగా గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఎస్‌వి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, కోటికిపైగా గాజులను ఉపయోగించి.. శ్రీ దివ్య కంకణ అలంకార మహా గణపతి పేరుతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో ఇదే గాజువాక ప్రాంతంలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష కాటన్, పట్టు చీరలతో శ్రీ సుందర వస్త్ర మహా గణేశ పేరుతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మన సంప్రదాయానికి ప్రతీకలైన గాజులకు ప్రాధాన్యమిస్తూ గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు SV ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన గణేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కళాకారుల బృందం, వివిధ రంగుల మట్టి గాజులతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహ తయారీలో చిన్న చెక్క దుంగలు, కేన్ వంటి పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ వినాయక చవితి పండుగకు కొన్ని వారాల ముందుగానే, ఆగస్టు 2026 నాటికి విగ్రహం తయారీని పూర్తి చేయనున్నారు.

మరోవైపు గాజులకు ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్ నుంచి వినాయకుడి విగ్రహం తయారీకి కావాల్సిన గాజులను సేకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలో జరిగే గణేష్ ఉత్సవాల్లో ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, విశాఖతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు ఈ ప్రత్యేకమైన విగ్రహాన్ని దర్శించుకుంటారని వెల్లడించారు. మరోవైపు ఎస్‌వి ఎంటర్‌టైన్‌మెంట్స్ 2024లో విశాఖలో 89 అడుగుల ఎత్తుతో శ్రీ మహా ఉచ్ఛిష్ట గణపతి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

2023లో శ్రీ అనంత పంచముఖ మహా గణపతి రూపాన్ని నెలకొల్పారు. 2022లో కైలాస విశ్వరూప మహా గణపతి రూపంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కోటికి పైగా గాజులను ఉపయోగించి రూపొందించే ఈ వినాయకుడి విగ్రహం.. ఆధ్యాత్మికతను, అద్భుతమైన కళా నైపుణ్యాన్ని చాటిచెప్పనుంది.

Previous జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Next కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు
ADVERTISEMENT