డైలీ భారత్, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం మంగళవారం ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.సోమవారం పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ, దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి
ఈ క్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకుల నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించారు
మంగళవారం మధ్యాహ్నం రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుల నివాసం వద్దకు చేరుకున్న శ్రేణులు, అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం వైపు పాదయాత్రగా దూసుకెళ్లారు. భద్రతా వలయాలను ఛేదించి ప్రధాని ఇంటి ముందుకు చేరుకున్న ప్రతిపక్ష అగ్రనేతలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హఠాత్పరిణామానికి గురైన ఢిల్లీ పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు
ఈ అంశంపై తక్షణ చర్చకు పట్టుబడుతూ ఉభయ సభల్లోనూ స్లోగన్లు ఇస్తూ నిరసన తెలపడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ పూర్తిగా స్తంభించిపోయి, సభలు వాయిదా పడ్డాయి