| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మోసాల వెంచర్‌కు గ్రామపంచాయతీ బ్రేక్..!

మోసాల వెంచర్‌కు గ్రామపంచాయతీ బ్రేక్..!

సర్వే పూర్తయ్యే వరకు అమ్మకాలు బంద్ చేయాలి

10% భూమి – ప్రభుత్వ భూమి అప్పగించే వరకు ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు

కోడిచెర్ల తండా గ్రామపంచాయతీ బాడీ ఏకగ్రీవ తీర్మానం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : కోడిచెర్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని సన్‌రైజ్ వెంచర్‌లో అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని గ్రామపంచాయతీ పాలకవర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. గ్రామపంచాయతీకి చట్టబద్ధంగా రావాల్సిన10 శాతం భూమిని ఇప్పటికీ అప్పగించకపోవడం, ప్రభుత్వానికి చెందిన ఒక ఎకరం ఒక గుంట భూమిని సర్వే చేసి గ్రామపంచాయతీకి అప్పగించకపోవడం, గ్రామ క్రీడా ప్రాంగణం రక్షణలో అధికారులు విఫలం కావడం వంటి అంశాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

"వెంచర్‌లో జరుగుతున్న అక్రమాలు అధికారుల కంటికి కనిపించడం లేదా? ప్రజల ఫిర్యాదులు చెవులకు వినిపించడం లేదా?" అని గ్రామపంచాయతీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెంచర్ యాజమాన్యం ప్లాట్ల విక్రయాలు, కొనుగోళ్లు మరియు ఇతర కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కోడిచెర్ల తండా గ్రామపంచాయతీ సమావేశంలో పాలకవర్గం ఈరోజు ఏకగ్రీవంగా కీలక తీర్మానం చేసింది. గ్రామపంచాయతీకి రావాల్సిన 10 శాతం భూమిని పూర్తిగా అప్పగించే వరకు, ప్రభుత్వ భూమి ఒక ఎకరం ఒక గుంటకు సర్వే పూర్తి చేసి గ్రామపంచాయతీకి అప్పగించే వరకు, గ్రామ క్రీడా ప్రాంగణాన్ని రక్షించే వరకు సన్‌రైజ్ వెంచర్‌లో ఎలాంటి విక్రయాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు లేదా ఇతర కార్యకలాపాలు జరగకుండా వెంటనే నిలిపివేయాలని* తీర్మానించింది.

అదేవిధంగా సంబంధిత అధికారులు వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలని, గ్రామపంచాయతీకి హక్కుగా రావాల్సిన 10 శాతం భూమిని పూర్తి స్థాయిలో ఇప్పించాలని పాలకవర్గం డిమాండ్ చేసింది.

అప్పటి వరకు సన్‌రైజ్ వెంచర్‌లో ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు, అభివృద్ధి పనులు లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని గ్రామపంచాయతీ బాడీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో సర్పంచ్ శాంతి నాయక్, ఉపసర్పంచ్ స్వప్న నాయక్, వార్డు సభ్యులు బిచ్య నాయక్, సంతోష్ నాయక్, వినోద్ నాయక్, లలిత నాయక్, శాంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Previous ఆఫీస్ వాష్‌రూమ్‌లో డీజీపీ అనుమానాస్పద మృతి!
Next ప్రభుత్వ ఈఎన్ టీ డాక్టర్ ను సన్మానించిన సహ చట్టం నాయకులు
ADVERTISEMENT