12 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జిల్లా సి.సి.ఎస్ పోలీస్ బృందం విశ్వసనీయ సమాచారంతో నిర్వహించిన దాడిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో షేక్ ఆధిల్ (తండ్రి: షేక్ యూనుస్) పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాడనే సమాచారం అందడంతో సి.సి.ఎస్ (CCS) పోలీసులు వెంటనే దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం తీవ్రమైన నేరం. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదు. ఎవరు అయినా సరే కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.
అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, రేషన్ బియ్యం అక్రమ రవాణా లేదా నిల్వలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.