డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని జంగావాణి గూడెం (రాంపూర్) గ్రామ పంచాయతీ పరిధిలో గల ఉడుగు చెరువు కట్టను ఇరిగేషన్ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.
గతంలో కురిసిన భారీ వర్షాలకు, వరద ఉధృతికి ఈ చెరువు కట్ట తెగిపోవడంతో సుమారు 500 ఎకరాల ఆయకట్టు సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన
స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ డి.ఇ (DE) రాజు, ఏ.ఈ (AE) శ్రావణి క్షేత్రస్థాయిలో పర్యటించి కట్ట దెబ్బతిన్న తీరును పరిశీలించారు. చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనివల్ల వందలాది ఎకరాల సాగు భూమికి నీరందుతుందని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెరువు కట్ట తెగిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని కోరారు.
దీనికి అధికారులు స్పందిస్తూ.. నివేదికను ఉన్నతాధికారులకు పంపి, త్వరలోనే మరమ్మతు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.