డైలీ భారత్, బీబీపేట:ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి, బీబీపేట మండలంలో ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను BC-D నుండి BC-A లోకి మార్చాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.
ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మాట్లాడుతూ తెలంగాణలో 55 శాతం జనాభా ఉన్న ముదిరాజులకు ఇచ్చిన హామీని ఇప్పటివరకు ప్రభుత్వం నెరవేర్చకపోవడం బాధాకరమని అన్నారు. జనాభా ప్రకారం తమకు రావాల్సిన పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందు ఉంచుతున్న ప్రధాన డిమాండ్లు:
1. BC-D నుండి BC-A కు మార్పు: వెంటనే జీవో విడుదల చేయాలి.
2. ముదిరాజ్ బంధు & పెన్షన్: ప్రతి ముదిరాజ్ కుటుంబానికి ప్రతి నెల పెన్షన్, ముదిరాజ్ బంధు అమలు చేయాలి.
3. ప్రమాద బీమా: చేపలు పట్టేటప్పుడు, చింతకాయలు, మామిడి, జామ పండ్లు తెంపేటప్పుడు, చెట్లు ఎక్కేటప్పుడు, పొలాల్లో పనులు చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా ఏ ప్రమాదంతో చనిపోయినా, సాధారణ మరణం అయినా రూ. 10 లక్షల నుండి 15 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలి.
4. మూడెకరాల భూమి: ప్రతి ముదిరాజ్ కుటుంబానికి 3 ఎకరాల భూమి కేటాయించాలి. అందులో మామిడి, జామ, సీతాఫలం వంటి పండ్ల తోటలు, కూరగాయల సాగు చేసుకుంటామని తెలిపారు.
5. ముదిరాజ్ భవనాలు: ప్రతి మండలంలో ముదిరాజ్ భవనం, ప్రతి గ్రామంలో చిన్న భవనం నిర్మించాలి. ఆ భవనాల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమస్యలు, ప్రభుత్వ పథకాలపై చర్చించుకుంటామన్నారు.
6. రాజకీయ ప్రాధాన్యత: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లలో ముదిరాజులకు పెద్దపీట వేయాలి.
ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర పిలుపు మేరకు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఏ పార్టీ తమకు హామీలు ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా ముదిరాజుల గురించి ముందుగా ఆలోచించాలని కోరారు.