డైలీ భారత్, వరంగల్:ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ చాణక్య అన్నారు.
ఆదివారం జిడబ్ల్యూఎంసీ పరిధిలోని కాశిబుగ్గ, తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆన్లైన్ లో నమోదు తీరును ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సర్వే నమోదులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేకుండా ఆప్ లో సర్వే వివరాలు నమోదు చేయాలని,సర్వే యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు దృష్టి కి తీసుకువచ్చి పరిష్కరించు కోవాలన్నారు. సర్వే పారదర్శకంగా కొనసాగాలని, ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి లబ్ది చేకూర్చాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు కృష్ణారెడ్డి, రెవిన్యూ అధికారులు శ్రీనివాస్, శహజాది బేగం, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.