80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను అంతమొందించిన ఇజ్రాయెల్..!
డైలీ భారత్, ఇజ్రాయిల్:ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్‌బొల్లా అధినేత హస్సన్ నస్రల్లా హతమైన విషయం తెలిసిందే. హిజ్‌బొల్లా చీఫ్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ఏకంగా 80 టన్నులకుపైగా బాంబులను వాడినట్లు స్థానిక మీడియా నివేదించింది
నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. బీరుట్ లో ఉన్న బిల్డింగ్‌లపై వైమానిక దాడులకు పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్‌బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 80కిపైగా బాంబులను హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై వేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బంకర్లలోకి చొచ్చుకెళ్లేంత బరువు ఉన్న బాంబులను ఐడీఎఫ్ వాడినట్లు పేర్కొంది. ఇందుకోసం ఉపయోగించిన ఒక్కో బాంబు సగటున ఒక టన్ను బరువు ఉంటుందని తెలిపింది.
మరోవైపు తమ దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం ధ్రువీకరించింది. "హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు" అంటూ ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. నస్రల్లా హతం వేళ ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా తన సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే సమయంలో నస్రల్లా హతం వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హిజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సరదు అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.