| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గాజా గజగజ

గాజా గజగజ

డైలీ భారత్, గాజా : గాజాను తలచుకొంటేనే గుండె బేజారెత్తుతోంది. అక్కడున్న 20 లక్షలకు పైగా పాలస్తీనా ప్రజలు కనీస మానవీయ సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్తు, ఇంధనం, మందులకు, తిండికి కూడా నోచుకోకుండా, పసి పిల్లలను ఎలా సాకాలో తెలియని హృదయ విదారక స్థితిలో ఎలా బతుకుతున్నారో ఊహించడం కష్టం.

ఈ నెల 7న హమాస్ తనపై జరిపిన భీకర దాడికి ప్రతీకారంగా దానిని నిర్మూలించే పనిలో భాగంగా గాజా జనావాసాల విధ్వంసానికి ఇజ్రాయెల్ సమకట్టింది.

దాని దాడుల్లో అక్కడి భవనాలు నేలమట్టమవుతున్నాయి. వెంటనే గాజాను ఖాళీ చేయవలసిందిగా ఇజ్రాయెల్ చేసిన హెచ్చరిక మేరకు 10 లక్షలకు పైగా పాలస్తీనియన్లు ఇళ్ళు విడిచి రోడ్డున పడ్డారని వార్తలు చెబుతున్నాయి.

వీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆశ్రయం ఇస్తారు అనేవి ఇంకా స్పష్టం కాలేదు. వీరికి ఈజిప్టు ఆశ్రయమిస్తుందని, సరిహద్దుల్లోని రఫా అనే చోట దారి ఏర్పాటు చేస్తుందని అనుకొన్నారు. కాని అది ఇంకా అమలు కాలేదు. ఎటు పోదామన్నా ఇజ్రాయెల్ వైమానిక దాడులు తెరిపి ఇవ్వడం లేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని దాదాపు 3000 మంది ఇప్పటి వరకు దుర్మరణం పాలయ్యారు

1948లో లక్షలాది మంది పాలస్తీనియన్లను వారి భూభాగాల నుంచి ఇజ్రాయెల్ తరిమివేసిన ‘నక్బా’ మహా మానవ ప్రళయం తిరిగి చోటు చేసుకొంటున్న దృశ్యాలు గాజాలో కనిపిస్తున్నాయి. అప్పుడు పాలస్తీనాను విడిచి వెళ్ళిన వారు పలు అరబ్ దేశాలలో ఎక్కడెక్కడో స్థిరపడిపోయారే గాని, స్వస్థలాలకు తిరిగి చేరుకోలేదు.

ఇప్పుడు కూడా అలాగే జరిగే ప్రమాదం కనిపిస్తున్నది. అయితే గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయవద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరించిందని చెబుతున్నారు. కాని అది వినాలి కదా, వినకపోతే దానిని అమెరికా ఏమైనా చేయగలదా? ఇజ్రాయెల్‌ను వెనక్కి లాగే సదుద్దేశం అమెరికాలో బొత్తిగా కనిపించడం లేదు.

ఈ సమస్యకు దౌతపరిష్కారం లేదని సైనిక మార్గమే శరణ్యమని అది భావిస్తున్నట్టు రూఢి అవుతున్నది. అదే జరిగితే ఇజ్రాయెల్ ఎంత మంది పాలస్తీనియన్లనైనా బలి తీసుకొనే ప్రమాదం వుంది. అదే సమయంలో ప్రస్తుతానికి అమెరికా మాటను కాదనలేక లోలోపల రగులుతున్న అరబ్ దేశాలు ఊరకే చేతులు ముడుచుకొని కూచుంటాయా?

హమాస్‌ను తీవ్రంగా ఖండించాలని వాటిని అమెరికా కోరినట్టు తెలుస్తున్నది. అందుకు వెనకాడిన ఆ దేశాలు మధ్య మార్గంగా హమాస్‌ను, ఇజ్రాయెల్‌ను శాంతి బాటలో నడవాలని అమాయక జనాన్ని బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి

Previous అధికారుల వేధింపులకు మహిళా కండక్టర్ ఆత్మహత్య?
Next భార్యను కత్తితో పొడిచి చంపి.. ఆపై భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య..
ADVERTISEMENT