| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"పాఠశాల విద్య గాడిన పడేనా"?

"పాఠశాల విద్య గాడిన పడేనా"?

డైలీ భారత్, (స్పెషల్ స్టోరీ) : తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సామాజిక బాధ్యతగా, విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో సూచిస్తూ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం గురుకుల విద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా అప్పటికే కొనసాగుతున్న పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది.

ప్రభుత్వ అధికారిక లెక్కలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు మనకు కనబడుతున్నాయి.13,374 పాఠశాలల్లో 50 మంది లోపే పిల్లలు(PS,UPS,HS అన్ని కలిపి),5,821 బడుల్లో ఒకే టీచర్,1213 పాఠశాలలు జీరో బడులు(పిల్లలు లేనివి) ఉన్నాయి.ప్రతి ఏటా జీరో బడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ బడులకు ఆదరణ తగ్గుతుందనే విషయం మనకు అర్థం అవుతుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగం గాడి తప్పడానికి కారణాలగా గత దశాబ్ద కాలంలో కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేయడం,మౌలిక సదుపాయాల కొరత,టీచర్ల కొరత,పర్యవేక్షణ లోపం,సత్ఫలితాలను ఇవ్వని పథకాల అమలు,ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు ఏర్పడిన అభిప్రాయం,బడులకు సరిపోయే బడ్జెట్ కేటాయించకపోవడం వంటివి ఉన్నాయి.

రాష్ట్రంలో 26074 మండల పరిషత్ ,జిల్లా పరిషత్ పాఠశాలలు, 194 మోడల్ స్కూల్ లు,475 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 31 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 51 సెంట్రల్ బడులు,161 మదర్సాలు, 11637 ప్రైవేట్ పాఠశాలలు, 1002 సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటన్నింటిలో 1 నుండి 10 వ తరగతి వరకు దాదాపుగా 60 77073 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో 30 93 368(50.90%), ప్రైవేటు లో 29 83705( 49.09 %) ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం విద్యార్థులు ఉన్న బడుల్లో టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పదిమంది విద్యార్థులకి 8 మంది టీచర్లు ఉన్నారని, 130 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని తరచూ వార్తాపత్రికల్లో ఇలాంటి కథనాలు మనం చూస్తున్నాం.ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అయా జిల్లాలలోని మండలాన్ని యూనిట్ గా చేసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు చేసి తాత్కాలికంగా ఉపాధ్యాయుల కొరతను విద్యాశాఖ తీర్చుతుంది.  ఉపాధ్యాయులు అందుబాటులో లేని బడుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తుంది.దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉపాధ్యాయుల నియామకాలు చేస్తూ, హేతుబద్ధీకరణ చేయడమే.

నాడు ఉపాధ్యాయులు వారు పనిచేసే ప్రాంతంలో నివసిస్తూ ప్రజలతో మమేకం అయ్యేవారు. వారి కష్ట సుఖాల్లో భాగస్వాములై, అనేక సామాజిక ఉద్యమాలకు రూపకర్తలుగా మారారు.సామాజిక సమస్యలపై ప్రజలతో పాటు ఉపాధ్యాయులు కూడా ముందు వరుసలో ఉండి ప్రజల కోసం పోరాడేవారు.అందుకే ప్రజల్లో ఉపాధ్యాయులను నాడు గొప్ప వ్యక్తులు గా చూసేవారు. రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో నాటి తరం ఉపాధ్యాయులు ఉండేవారు అనడంలో అతిశయోక్తి లేదు.

నాటితో పోల్చుకుంటే నేటితరం ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ తగ్గిందని చెప్పవచ్చు. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం తగ్గింది.

ప్రగతిశీల చైతన్యపూరిత భావజాలం కు బదులుగా  కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వచింతన విద్యా రంగంతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నాయి. ప్రజలకు ఉపాధ్యాయులకు మధ్య అవినాభావ సంబంధం తగ్గింది. గతంతో పోలిస్తే నేటితరం ఉపాధ్యాయులపై ప్రజల్లో ప్రేమ అభిమానాలు, గౌరవం తగ్గాయి. వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత నేటి తరం ఉపాధ్యాయుల పైన ఉంది.

ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు కోసం ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణలను ఇస్తూ, పర్యవేక్షణ అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం లేని వారిని నియమిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం గల వారిని మాత్రమే నియమించాలి. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకోవాలంటే బోధనా అనుభవం ఉన్న అధికారులతో మాత్రమే సాధ్యమవుతుంది.

తెలంగాణ రాష్ర్టగత బడ్జెట్ లో విద్యారంగానికి 6.24 %  నిధులు కేటాయించగా ఈ సారి ₹21389 (7.75%) కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 1.51% అధిక నిధులు విద్యారంగానికి కేటాయించారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేస్తామని దానికి నిధులు కేటాయించడం సంతోషమే, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న

పాఠశాలలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాల్సి ఉంది.ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 

దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణ తన బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యల్పంగా 7.75% నిధులను కేటాయించింది. డిల్లీ 21.1%,,కర్ణాటక 11%, ఆంధ్రప్రదేశ్(12.6%), కేరళ(14%), తమిళనాడు(14.1%) రాష్ట్రాలు విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కి అత్యధిక నిధులు కేటాయించాయి. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగా కేటాయింపులు చాలా తక్కువ. రాబోయే రోజుల్లో విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ చేయాలంటే రాష్ట్రస్థాయిలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు, ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులైన టీచర్ల తో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి వారి సలహా, సూచనలతో విద్యారంగాన్ని పట్టిష్టపరుస్తూ పాఠశాల విద్యను సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయింపు, మౌలిక సౌకర్యాల కల్పన, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ నియామకాలు, పర్యవేక్షణ, ప్రైవేటు బడుల్లో ప్రభుత్వ వాటి పుస్తకాలు వాడేలా చర్యలు తీసుకోవాలి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గాడి తప్పిన పాఠశాల విద్యారంగాన్ని కాపాడుతుందని ఆశిద్దాం.


పాకాల శంకర్ గౌడ్

విద్యావేత్త

9848377734.

Previous పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Next హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ADVERTISEMENT