డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పట్టుదలతో శ్రమిస్తే ప్రతి రంగంలోనూ విజయం సొంతం అవుతుందని మున్సిపల్ కమిషనర్ డి. లావణ్య అన్నారు. శనివారం స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరై కమిషనర్ మాట్లాడుతూ వార్షిక పరీక్షలు పూర్తి కాగానే ప్రతి రోజునూ సద్వినియోగం చేసుకోవాలని, సమయ పాలనతో పాటు లక్ష్య సాధనకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలన్నారు. రోజుకు రెండు సబ్జెక్టుల వంతున మూడు నుంచి నాలుగు గంటల పాటు అభ్యాసం చేస్తే ఉద్యోగాల సాధన సులువు అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో పలు శాఖల్లో ఉద్యోగాల కల్పనకు ప్రకటనలు రానున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటినుంచే లక్ష్య సాధనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. కచ్చితంగా సాధించి చూపించాలన్న మానసికి సంకల్పం భౌతిక శక్తులను కూడా సమకూరుస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గెంట్యాల భూమేశ్ మాట్లాడుతూ పట్టభద్ర స్థాయినుంచి ప్రభుత్వ స్థాయికి ఎదగడానికి అవసరమైన మార్గదర్శనం కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తోట రాజేందర్, డి. లక్ష్మి, దామెర స్వామి. చిటికెన వేణుగోపాల్, నాగుల శరత్కుమార్, లావణ్య విద్యార్థులు పాల్గొన్నారు.
అలరించిన ట్రెడిషనల్ డే...
మహతి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన ట్రెడిషనల్ డే ఉత్సవం ఆసాంతం అలరించింది. విభిన్నమైన సంప్రదాయ దుస్తుల్లో హాజరైన విద్యార్థినుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశంలోని పౌరులందరూ ఒక్కటే అన్న భావనను విద్యార్థుల్లో కలిగించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల నిర్వాహకులు డాక్టర్ పి. రాజు, ఫౌండర్ ప్రిన్సిపాల్ భూమేశ్ తెలిపారు.