| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినా భద్రత లేనట్టేనా?

బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినా భద్రత లేనట్టేనా?

ఖాతాదారుల అసలు నగల స్థానంలో గిల్ట్ ఆభరణాలు.. రూ.1.45 కోట్ల మోసం!

డైలీ భారత్, కాకినాడ: బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే ఖాతాదారులకు భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కాకినాడ శాఖలో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న సూరిబాబు, ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలు బంగారు ఆభరణాల స్థానంలో గిల్ట్ ఆభరణాలను ఉంచి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుమారు రూ.1.45 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం.

44 గోల్డ్ ఖాతాల్లో మోసం!

వివరాల ప్రకారం.. ఖాతాదారులు బంగారు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలను గోల్డ్ అప్రైజర్ సూరిబాబు మార్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు బంగారు ఆభరణాలను తన వద్ద ఉంచుకుని, వాటి స్థానంలో గిల్ట్ ఆభరణాలను బ్యాంకులో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సుమారు 44 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించి ఒక కిలో 57 గ్రాముల బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.1 కోటి 45 లక్షలుగా అంచనా వేస్తున్నారు.

బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఎలా సాధ్యం?

ఈ ఘటన ఇప్పుడు పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టే సమయంలో బంగారు ఆభరణాలను పరిశీలించడం, వాటి నాణ్యతను నిర్ధారించడం, అనంతరం భద్రపరచడం వంటి ప్రక్రియలు బ్యాంకు నిబంధనల ప్రకారం జరగాలి. అలాంటప్పుడు అప్రైజర్ అసలు బంగారాన్ని తీసేసి గిల్ట్ ఆభరణాలను ఎలా ఉంచగలిగాడు? ఆభరణాలను పరిశీలించిన ఇతర సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించలేదా? భద్రతా విధానాల్లో లోపాలున్నాయా? లేక ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల దర్యాప్తు.. అప్రైజర్ అరెస్ట్

ఈ వ్యవహారంపై కాకినాడ వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, గోల్డ్ అప్రైజర్ సూరిబాబును అరెస్టు చేసినట్లు సమాచారం. అసలు బంగారు ఆభరణాలను ఎలా బయటకు తరలించారు? ఈ మోసం ఎంతకాలంగా కొనసాగుతోంది? బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఎందుకు గుర్తించలేకపోయారు? మరెవరైనా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారా? అనే అంశాలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.

ఖాతాదారులు నమ్మకంతో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారానికే భద్రత లేకపోతే ఎలా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులందరినీ గుర్తించి, ఖాతాదారులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Previous అశ్వారావుపేటలో చెరువులు మురుగుగుంటలుగా మారుతున్నాయి... బీజేపీ ఆందోళన
Next కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ప్లాట్ కబ్జా... ఎస్పీకి మహిళ ఫిర్యాదు
ADVERTISEMENT