డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం, టేకులపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న సేవాల్ సేన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో సేవాల్ సేన నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో సేవాలాల్ సేన నేతలు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు. అయితే పోలీసులు జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, నరేష్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు.
40 కి.మీ. వెళ్లి వైద్యం...
టేకులపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని, బోడు, సిద్దారం, బర్లగూడెం, జంగాలపల్లి, ఒడ్డుగూడెం, రాజారాం తండా తదితర 10కి పైగా గ్రామాల ప్రజలు వైద్యం కోసం 40 కి.మీ. దూరంలో ఉన్న సులానగర్ PHCకి వెళ్లాల్సి వస్తోందని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్ తెలిపారు. సరైన రవాణా లేక సకాలంలో చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది అప్రజాస్వామిక చర్య అని, వెంటనే నాయకులను విడుదల చేయడంతో పాటు బోడులో PHC ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన కోరింది.