ప్రజలకు నాణ్యమైన, బాధ్యతాయుతమైన పోలీసు సేవలు అందించాలి – జిల్లా ఎస్పీ
డైలీ భారత్, కామారెడ్డి: నూతనంగా బిక్నూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఎస్. అనిల్, రాజంపేట పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా డి. ఆంజనేయులు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా కె. విజయ్, బీబీపేట పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర, బాన్సువాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా శిరీష బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన బాధ్యతలు స్వీకరించిన అధికారులను అభినందిస్తూ, పోలీసు ఉద్యోగం ప్రజలకు సేవ చేయడానికి లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి ప్రజలకు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని సూచించారు. అదే సమయంలో నేరాల నియంత్రణలో రాజీ పడకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.
క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, పారదర్శకతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ప్రజా భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా భావించి ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు