"సెకండ్‌హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ 3 నిబంధనలు తప్పనిసరి"
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల అమ్మకాలు, కొనుగోళ్లపై పోలీసులు కొత్త నిబంధనలు విధించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ షాప్ మరియు రిపేర్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సెకండ్‌హ్యాండ్ మొబైల్ అమ్మడానికి లేదా ఎక్స్ఛేంజ్ చేయడానికి వస్తే వారి ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
దొంగిలించబడిన లేదా అనుమానాస్పద మొబైల్ ఫోన్లు విక్రయానికి వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా దొంగలను పట్టించడంలో సహకరించిన షాప్ యజమానులకు జిల్లా పోలీసుల తరఫున ప్రశంసాపత్రం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలకు సూచనలు:
సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు షాప్ నుంచి బిల్లు/రసీదు తీసుకోవాలి
తక్కువ ధరకు ఆశపడి దొంగిలించబడిన ఫోన్ కొంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి
మొబైల్ అమ్మాలంటే కంపెనీ స్టోర్ లేదా లైసెన్స్ ఉన్న షాపుల్లోనే చేయాలి
మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్ https://www.ceir.gov.in లో బ్లాక్ చేసి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి
దొంగిలించబడిన ఫోన్లను సైబర్ నేరాలకు వాడే అవకాశం ఉందని, అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.
ఈ సహకారంతోనే సిరిసిల్ల జిల్లా మొబైల్ రికవరీలో దక్షిణ భారతదేశంలో 1వ స్థానం, రాష్ట్రంలో వరుసగా 3వ ఏడాది 1వ స్థానంలో నిలిచిందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో IT Core SI కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ మరియు పలువురు మొబైల్ వ్యాపారులు పాల్గొన్నారు.