డైలీ భారత్, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి.
ముఖ్యమంత్రి హామీల సాధన కోసం వరుస నిరసనలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది.
దీంతో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
టీడీపీ నేత బుద్ధప్రసాద్ సహా పలువురు తెలుగుదేశం, జనసేన నేతలను ఇళ్ళ వద్ద నిర్బంధించారు.
ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటికి వెళ్ళే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వందల మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మహాధర్నా నిర్వహించి తీరుతామని తెలుగుదేశం, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
సామాన్యుడు నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా పోలీస్ ఆంక్షలు తప్పకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మహాధర్నాను చేసి తీరతామని టీడీపీ, జనసేన.. అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అవనిగడ్డలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది.