తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ అన్ని విధాలుగా దోచుకుంది : చల్లా వంశీచంద్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ నట్టేట ముంచాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాలపై ఉద్యమం చేస్తామని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీలు ఉన్నా, తెలంగాణకు వాట దక్కలేదని తెలిపారు. కానీ, పార్లమెంట్‌లో ఓట్లు పొందేందుకు కేసీఆర్ నాటకాలు మొదలుపెట్టాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ కనీసం అపెక్స్ కమిటీ మీటింగ్‌కు వెళ్లలేదని అన్నారు.
ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ కుమ్మక్కై, మన వాటానూ ఏపీకి తరలించాడని ఆరోపించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో 68 శాతం ఉండగా, ఏపీఙలో 32 శాతం ఉందని అన్నారు. కానీ, తెలంగాణకు సరైన వాట అందలేదని గుర్తు చేశారు. దీంతో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. నీటి హక్కుల కోసం కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో కొట్లాడలేదని అన్నారు. ముడుపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును రూ.లక్ష కోట్లకుపైగా పెంచారని గుర్తు చేశారు. ఉద్యమం చేయాల్సినప్పుడు చేయకుండా, ఇప్పుడు ఉద్యమం అంటే ప్రజలు నవ్వుతారని ఎద్దేవా చేశారు. పునర్విభజన చట్టం సరిగ్గా లేదని కేంద్రంతో కొట్లాడలేదని ఆరోపించారు.
సీడబ్ల్యూసీ ఇన్వైటీ చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ అన్ని విధాలుగా దోచుకుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సూపరిపాలన నడుస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని బయట పెడతామని అన్నారు. నిబంధనలు ప్రకారం 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రశ్నించ లేదని అన్నారు. కనీసం కేటాయించిన 299 టీఎంసీలను కూడా కేసీఆర్ వాడలేదని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు కేవలం 212 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నానరని తెలిపారు. నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.