| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

పాల్వంచ, లోట్టి వాగు, గంగమ్మ వాగు, గొల్లపల్లి, లింగంపేట్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ

రహదారులపై పడిన చెట్ల తొలగింపు – ప్రమాద నివారణకు తక్షణ చర్యలు

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 24 గంటల అప్రమత్త విధులు

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవనీయులైన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్వంచ వంతెన సమీపంలో పాత, వినియోగంలో లేని రహదారిపై నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అక్కడికి వెళ్లకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఇరువైపులా ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అక్కడే పోలీసు సిబ్బందిని నియమించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఫరీద్‌పేట్–వాడి గ్రామాల మధ్య ఉన్న లోట్టి వాగు వద్ద నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులను జేసీబీ సహాయంతో తొలగించి, నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు.

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం సాధారణంగా ఉన్నప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా ఒక పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

లింగంపేట్ గ్రామ సమీపంలోని కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై భారీ మర్రిచెట్టు పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, వర్షాల సమయంలో ప్రజలు వాగులు, వంతెనలు, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడవేయవద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

Previous తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...
Next సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
ADVERTISEMENT