త్రినేత్రుని దర్శనానికి విస్తృత ఏర్పాట్లు.. మూడు రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు
డైలీ భారత్, కోటప్పకొండ:త్రినేత్రుడైన శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం కోటప్పకొండలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు వైభవంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహణాధికారి (ఈవో) చంద్రశేఖర రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలి ఏకాదశి పుణ్యదినాల్లో స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులు పూర్తి చేశామని వెల్లడించారు.
ఆలయ మండపంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ ప్రత్యేక అభిషేకాల్లోను, పూజా కార్యక్రమాల్లోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందాలని ఆలయ అధికారులు పిలుపునిచ్చారు.