| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

తిరుపతి కుటుంబ విషాదం వెనుక దాగిన ఆర్థిక కష్టాలు

డైలీ భారత్, తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లాలో జరిగిన ఐదుగురి మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన కుటుంబాన్ని మొత్తం బలితీసుకున్న హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి బుధవారం తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్‌కు వెళ్లి, మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన ఇద్దరు పిల్లలు కౌశిక్‌ (14), హరిణి (12)లను ఇంటికి తీసుకొచ్చాడు.

పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా స్కూటీపై బయట తిప్పి, చివరకు రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో తండ్రిని కాపాడే ప్రయత్నంలో పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఆన్‌లైన్ రమ్మీతో రూ.40 లక్షల అప్పులు

మోహన్ కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసై రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉన్న ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అప్పుల ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాడు. ఈ ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.


తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణానంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడు. కుటుంబ పోషణ బాధ్యతను భార్య హరితే భుజాన వేసుకుని బ్యూటీ పార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు సిమెంట్ షాపు కూడా ప్రారంభించింది. అయినా మోహన్ తన వ్యసనాన్ని నియంత్రించుకోలేక చివరకు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

గురువారం ఐదు మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు సందేశం: ఆన్‌లైన్ రమ్మీ – వినోదం కాదు, ప్రమాదం కూడా కావచ్చు

ఆన్‌లైన్ గేమ్స్ మొదట వినోదంగా మొదలై, తరువాత వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.

డబ్బుతో ఆడే గేమ్స్ అప్పుల బారిన పడేలా చేస్తాయి.

ఒక్క వ్యక్తి వ్యసనం మొత్తం కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు.

సమయం, డబ్బు పరిమితులు పెట్టుకోవడం చాలా అవసరం.

వ్యసనం పెరుగుతున్నట్టు అనిపిస్తే కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి.

“ఆన్‌లైన్ రమ్మీ సరదా కాదు… జీవితాన్ని నాశనం చేసే వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.

కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం – వ్యసనాలకు దూరంగా ఉండండి.”


#rummy #pocker 

Previous నివారణ కలిగిన వ్యాధి మలేరియా
Next వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు
ADVERTISEMENT