డైలీ భారత్,హైదరాబాద్:ఈ నెల17న పాలకుర్తి, వరంగల్, భువనగిరి ప్రాంతాలలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు పర్యటించనున్నారు. ఆ ఏరియాల్లో ఏర్పాటు చేసే సభలకు హాజరు కానున్నారు.
తెలంగాణలో తుది దశ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేయనున్నారు. రాహుల్ గాంధీ ఏకంగా ఆరు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి పార్టీలో జోష్ నింపనున్నారు. సభలు, ప్రచారాల్లో భాగస్వామ్యం కానున్నారు. దీంతో పాటు చత్తీస్ ఘడ్, రాజస్థాన్, కర్ణాటక సీఎంలు సైతం రానున్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక ముఖ్య నేత పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలుస్తోన్నది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలను వేర్వేరుగా విభజించి కీలక నేతల ప్రణాళికను తయారు చేశారు.
టీపీసీసీ తయారు చేసిన ప్లానింగ్‌ను మంగళవారం ఏఐసీసీ కార్యాలయానికి పంపించనున్నారు. అగ్రనేతల నుంచి ఆదేశాలు రాగానే.. రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేల టూర్ ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఏఐసీసీ కంకణం కట్టుకున్నది. దీనిలో భాగంగానే అగ్రనేతలంతా వరుస పర్యటనలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
ఇప్పటికే సభలు, బస్సు యాత్ర, పాదయాత్రల పేరిట కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకువచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 17 వచ్చి వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని ఫిక్స్అయ్యారు.