డైలీ భారత్, చిన్న శంకరంపేట్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో తపాలా శాఖ ద్వారా సరికొత్త భీమా పథకాలు ప్రవేశపెట్టినట్లు వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ మెదక్ సౌత్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ కులకర్ణి సందీప్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపెట్ బ్రాంచ్ పోస్టాఫీసు ఆవరణలో గురువారం మెదక్ సౌత్ సబ్ డివిజన్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ కులకర్ణి సందీప్ ఆధ్వర్యంలో భీమా పాలసీలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖలో ప్రమాద భీమా పాలసీ తీసుకుని గత ఏడాది ప్రమాదవశాత్తు ట్రాక్టర్ లోనుంచి కింద పడి ప్రమాదంలో మృతి చెందిన భగీర్తిపల్లీ గ్రామ వాస్తవ్యుడు రెడ్డి సిద్దిరాములు గారి భార్య రెడ్డి సురేఖ కు రూపాయలు పది లక్షల ప్రమాద భీమా పాలసీ చెక్కును మెదక్ సౌత్ సబ్ డివిజన్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ కులకర్ణి సందీప్ అందించారు.
ఆనంతరం సందీప్ మాట్లాడుతూ, తపాలా శాఖ ద్వారా సేవలందిస్తున్న అనేక భీమా పథకాలపై ప్రజలకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న శంకరంపెట్ మండలంలోని వివిధ ప్రాంతాల నుండి హాజరైన ప్రజలకు తపాలా భీమా పాలసీలపై అవగాహన కల్పించారు. కేవలం రోజుకి రూ. 2 చెల్లించడం ద్వారా 15 లక్షల ఆక్సిడెంటల్ పాలసీ పొందవచ్చని, ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా ధీమాగా, ప్రశాంతంగా ఉండవచ్చని, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖ ద్వారా అందిస్తున్న భీమా పాలసీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత పోస్ట్ మాస్టర్లకు సూచించారు. తపాల శాఖ ద్వారా అందిస్తున్న భీమా పాలసీ పధకాలపై ఒక్కొక్కటిగా సమావే శంలో వివరించారు. ఈ కార్యక్రమంలో, ఐపిపిబి మెదక్ బ్రాంచ్ మేనేజర్ శరత్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ హర్షవర్ధన్, మెయిల్ ఓవర్సీర్లు చంద్ర గౌడ్, విజయ్, చిన్న శంకరంపెట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వెంకట రమణ, మండలంలోని వివిధ గ్రామాల పోస్ట్ మాస్టర్ లు మరియు చిన్న శంకరంపెట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...