| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. దోపిడీకి యత్నించిన దుండగులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సుమారు పన్నెండు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు.దుండగుల కదలికలను గుర్తించిన వృద్ధురాలు కేకలు వేయడంతో ఆగ్రహించిన నిందితులు ఆమెపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ముఖం, మెడ భాగంలో కత్తులతో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ వృద్ధురాలు చేసిన ఆర్తనాదాలు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నారు.తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముఖం, మెడపై తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ ఆధ్వర్యంలో క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దించి ఘటనాస్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.వృద్ధురాలిపై జరిగిన కిరాతక దాడితో చందిప్ప గ్రామం ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వేళ నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. రాత్రివేళల్లో అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100ను ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Previous నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Next పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
ADVERTISEMENT