| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

బాధితుల ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలి

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి – ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి

బీట్ సిస్టమ్, పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసి విజిబుల్ పోలీసింగ్ పెంచాలి

రోల్‌కాల్‌లో సిబ్బందికి విధుల నిర్వహణపై దిశానిర్దేశం

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

గణేష్ నవరాత్రుల సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి

యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ 

డైలీ భారత్, కామారెడ్డి:జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందితో స్వయంగా మాట్లాడి వారి విధుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ నిర్వహించే రోల్‌కాల్‌లో సిబ్బందికి ఎలాంటి అంశాలపై సూచనలు ఇస్తున్నారు, విధుల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తున్నారా అనే విషయాలను ఎస్పీ గారు సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు తెలియజేస్తున్న సూచనలు, ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సక్రమంగా చేరుతున్నాయా అని ఆరా తీశారు. రోల్‌కాల్ ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, సిబ్బందికి విధి నిర్వహణకు సంబంధించిన తాజా సూచనలు, నేరాల నియంత్రణకు అవసరమైన అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, CCTNS పనితీరు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెండింగ్, లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణలో భాగంగా బీట్ సిస్టమ్‌ను పటిష్టం చేసి, ప్రతి గ్రామంపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. బీట్ సిబ్బంది ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ ఉండాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

రానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిమజ్జనం, ట్రాఫిక్, ప్రజల రాకపోకలపై ముందస్తు ప్రణాళికతో బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సమన్వయంతో పనిచేసి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...
Next చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
ADVERTISEMENT