డైలీ భారత్, సిరిసిల్ల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి గణేష్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే ప్రారంభించారు. అనంతరం గణేష్ ఉత్సవాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) తో తయారైన విగ్రహాల వల్ల జలవనరులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని, దీనిని నివారించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. జిల్లాలో ప్రజలకు 2 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
ప్రకృతి, నీటి వనరులను పరిరక్షిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.