| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

డైలీ భారత్, కాకినాడ:ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య వేర్వేరుగా రాసిన సూసైడ్‌ నోట్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ రెండింటిలోనూ రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ సాధిక్‌ఖాన్‌ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొనడంతో అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.

‘‘ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్‌ రెడ్డి గోదావరిలో దూకారు. రియాన్స్‌ ప్రాణాలతో బయటపడగా మిగిలిన ముగ్గురు మృతిచెందారు. రాజమహేంద్రవరంలో తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. నూకరాజు వద్ద, సౌజన్య స్కూటీలో రెండు సూసైడ్‌ నోట్‌లు దొరికాయి. మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు. ఆమె మామ భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పీఎస్‌లో కేసు నమోదు చేశాం. నిందితుడు సాధిక్‌ఖాన్‌ కోసం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 10 పోలీసు బృందాలతో ఐదు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాం. చివరికి యూపీలోని మేరఠ్‌లో అతడి ఆచూకీ గుర్తించి అరెస్ట్‌ చేశాం. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారంట్‌పై కాకినాడ తీసుకొచ్చాం.

నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారై మేరఠ్‌ చేరుకున్న సాధిక్‌.. స్నేహితులకు మాయమాటలు చెప్పి ఆశ్రయం పొందాడు. ఫోన్‌, డబ్బు పోయినట్లు వారికి చెప్పాడు. అతడిపై వస్తోన్న మరికొన్ని ఆరోపణలపై విచారణ జరుగుతోంది. నిర్ధారణ అయ్యాక ఆ వివరాలు వెల్లడిస్తాం. హత్య, బలవంతపు మతమార్పిడి సెక్షన్ల కింద సాధిక్‌పై కేసులు నమోదు చేశాం. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తాం. కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతాం. కస్టడీలో ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. సామూహిక ఆత్మహత్య ఘటనకు ముందు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు అండగా ఉంటారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు’’ అని ఎస్పీ కోరారు.

సాధిక్‌ఖాన్‌కు 14 రోజుల రిమాండ్‌

సాధిక్‌ఖాన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం కాకినాడ సబ్‌జైలుకు సాధిక్‌ఖాన్‌ను తరలించారు. నిందితుడిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Previous వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
Next కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
ADVERTISEMENT