| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుడిమల్కాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఆరు ఫర్నిచర్ గోదాములు పూర్తిగా దగ్ధం

గుడిమల్కాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఆరు ఫర్నిచర్ గోదాములు పూర్తిగా దగ్ధం

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్ మొగల్ ఖానాల పరిధిలోని ఫర్నిచర్ గోదాముల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కపక్కనే ఉన్న ఇతర గిడ్డంగిలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు గోదాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 

ఐదు అగ్నిమాపక యంత్రాలతో పోరాటం:

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ పర్యవేక్షణలో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. గోదాముల్లో ప్లైవుడ్, చెక్క, ప్లాస్టిక్ ఫర్నిచర్‌తో పాటు డైపర్లు, ఇతర సులభంగా అంటుకునే వస్తువులు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. 

తప్పిన ప్రాణనష్టం.. భారీగా ఆస్తి నష్టం:

ఆదివారం కావడంతో ప్రమాద సమయంలో గోదాముల్లో కార్మికులు ఎవరూ లేరు. దీంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. అయితే, గోదాముల్లో ఉన్న లక్షలాది రూపాయల విలువైన ఫర్నిచర్, సామగ్రి పూర్తిగా బూడిదవడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గుడిమల్కాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Next కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
ADVERTISEMENT