16 ఏళ్లకే మాఫియా డాన్ కావాలన్న మోజు..
కన్న తల్లినే హతమార్చిన కుమారుడు
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రాజాంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన ఓ బాలుడు, తన స్నేహితుడితో కలిసి కన్న తల్లినే కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ముంజేటి సతీష్, స్పందన(34) దంపతుల కుమారుడు స్కూల్లో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో బుద్ధిగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి పలుమార్లు కుమారుడిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలుడు తల్లిపై కక్ష పెంచుకున్నాడు.
ఇదే సమయంలో “మనం ముంబై వెళ్లి మాఫియా డాన్లు అవుదాం” అంటూ తన స్నేహితుడితో కలిసి ప్రణాళిక రచించిన నిందితుడు, తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణానికి పాల్పడ్డాడు.
ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5 వేల నగదును బ్యాగులో వేసుకున్న అనంతరం, స్నేహితుడి సహాయంతో తల్లిపై కత్తితో దాడి చేశాడు. మొత్తం 16 కత్తిపోట్లు పొడిచి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత, మృతదేహాన్ని చీరతో చుట్టి ఇంటి పక్కనే ఉన్న కోనేరులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.