| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో ఎస్ఐ

ఏసీబీ వలలో ఎస్ఐ

డైలీ భారత్ న్యూస్,టెక్మాల్: ఏసీబీ ట్రాప్‌ను గ‌మ‌నించిన ఓ ఎస్ఐ  పోలీసు స్టేష‌న్ వెనుక వైపు గోడ దూకి, పొలాల మీదుగా ప‌రుగులు తీశారు. అక్క‌డే మాటు వేసిన సుమారు 15 మంది ఏసీబీ సిబ్బంది ఎస్ఐని వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న మెద‌క్ జిల్లా టెక్మాల్ పోలీస్టేష‌న్ వ‌ద్ద జ‌రిగింది. ఏసీబీకి ఎస్ఐ రాజేశ్ చిక్కిన‌ట్లు తెలియ‌డంతో స్థానికులు ట‌పాసులు పేల్చి కేరింత‌లు పెట్టారు.

మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు అద్దెకు తీసుకొచ్చిన హార్వెస్టర్ బ్యాటరీ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ప‌రిష్క‌రించ‌డానికి అసద్ మహమ్మద్ పల్లికి చెందిన రైతు పాండుకు స్థానిక ఎస్ఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం మొదటి దఫాగా రూ.30వేలు బాధితుడు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు టెక్మాల్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు రూ. 20వేలు ఎస్ఐకు ఇచ్చి వెళ్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఏసీబీ ట్రాప్ పై అనుమానం వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాదాపు 15 మందితో కూడిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం పొలాల్లో పరిగెత్తుతున్న ఎస్ఐ ను వెంబడించి పట్టుకున్నారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఓ వైపు ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారిస్తుండగా మరోవైపు స్థానికులు టపాసులు పేల్చడం గమనార్హం.

Previous ఏసీబీకి చిక్కిన టిజిఎస్‌పిడిసిఎల్ సహాయక ఇంజనీర్
Next మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ
ADVERTISEMENT