డైలీ భారత్: మనకి సంక్రాంతి తరువాత రెండవ అతి పెద్ద పండుగ దసరా & దేవీ నవరాత్రులు. విజయదశమి వరకు కొనసాగే దసరా శరన్నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభం. దసరా సరదాలు అన్నీఇన్నీ కావు. పాఠశాల కళాశాల లకు పదిరోజులు దసరా సెలవులు ఉంటాయి. ఇక సందడే సందడి. ఒకప్పుడు ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో కలిసి పద్యాలు పాడుతూ ఇంటింటికి తిరిగేవారు. ఇదో అపురూపమైన సందడి. దసరా వేషాలు, పులి వేషాలు, వివిధ దేవతా రూపాలను ధరించిన కళాకారులు వీధుల వెంట తిరుగుతూ ఉంటే అదో సంబరం. దసరా అంటే కొత్త చైతన్యం వచ్చేది. పాలపిట్ట దర్శనం, బొమ్మల కొలువులు, రామలీలా వేడుకలు, ముఖ్యమైన కూడళ్ళలో ప్రదేశాలలో దుర్గ, దేవి మూర్తులు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న పండుగ దసరా రోజులు. శాంతి సౌభాగ్యాలకు సంకేతం గనుక పాలపిట్ట దర్శనం శుభప్రదం. భగవంతుడు ఆడించే ఆటబొమ్మలం మనం గనుక నిజాయితీగా మసలుకోమనే సందేశం ఒక క్రమపద్ధతిలో పేర్చిన బొమ్మలకొలువు. తెలుగునాట కనకదుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడలో దసరా నవరాత్రులు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏనుగు సంబరాలు జరపడం ఆచారంగా వస్తోంది. కృష్ణా జిల్లా బందరులో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఒంగోలు లో కాళికాదేవి, మహిషాసుర మర్ధిని, నరసింహ స్వామి ముఖాకృతులను భారీగా రూపొందించి బండీల మీద ఎక్కించి డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. నార్త్ లో రామలీలా ఉత్సవాలు, మైదానాల్లో విజయదశమి రోజున రావణ సంహారం వంటివి పెద్ద ఎత్తున వేడుకలతో నిర్వహిస్తారు. కాశ్మీరీలకు ఖీర్ భవాని ఆలయ దర్శనం ఓ తప్పనిసరి ఆచారం. పంజాబీలు షేరన్ వాలీ మా ఆరాధనోత్సవాల పేరిట శక్తిపూజలు నిర్వహిస్తారు. బెంగాలీలకు కూడా అతిపెద్ద పండుగ దసరా.. కాళీమాతను విశేషంగా ఆరాధిస్తారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లలో మొదటిరోజు కలశారాధన చేస్తారు. ఇలా విభిన్న రీతుల్లో సంప్రదాయాలలో అంతటా ఉత్సాహంగా జరుపుకునే పర్వదినాలు.. దేవీ నవరాత్రులు, విజయదశమి పర్వదినాలు. దసరా రోజుల్లో వాహన పూజలు మరో ప్రత్యేకం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శక్తిస్వరూపిణి విశేషంగా ఆరాధనలు అందుకుంటుంది.
Devotional
దసరా శరన్నవరాత్రులు ప్రారంభం