డైలీ భారత్, సిరిసిల్ల:తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.
నేడు కాళోజీ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ భాషా పరిరక్షణకు కాళోజీ విశేషంగా కృషి చేశారని, తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.
తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని కవులు, రచయితలకు ఆయన దార్శనికుడిగా, స్ఫూర్తిదాతగా నిలిచారని పేర్కొన్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించబడిన కాళోజీ ఆశయాలు, స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు మధుకర్, సురేష్, రమేష్, సి.ఐ మధుకర్, మొగిలి, శ్రీలత, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఆర్.ఎస్.ఐ లు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.