డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని TPTF కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడారు.జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి ఉందని, చాలా పాఠశాలల్లో ఒకటి లేదా రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయులు FLN లో భాగంగా విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నారని తెలిపారు.విద్యాశాఖలో ఈ మధ్య విపరీత వింత పోకడలు ఎక్కువయ్యాయని విమర్శించారు. శాశ్వత పర్యవేక్షణ అధికారులను నియమించకుండా, ఉపాధ్యాయులను ఉపాధ్యాయులపైనే ప్రయోగిస్తూ విభజించి పాలించే విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు.ఇప్పుడు బాహ్య మూల్యాంకనం పేరుతో కొత్త రకం వేధింపులకు తెరలేపారని, ఉపాధ్యాయులను అనునిత్యం ఏదో ఒక విధంగా ఇబ్బందులకు, అయోమయానికి గురి చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు.ఉపాధ్యాయులకు స్వేచ్ఛగా బోధించుకునే వెసులుబాటు కల్పించాలని, బోధనేతర పనులను తగ్గించాలని, ఉపాధ్యాయుల వేధింపులను వెంటనే ఆపాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) తరపున డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు వాసు, శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
News