డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం కైవసం చేసుకుంది. జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర EAGLE టీం ప్రశంసలు కురిపించింది.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 22 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, యువతకు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా కార్యక్రమాలు నిర్వహించినందుకు EAGLE ఫోర్స్ జిల్లాను 2వ స్థానంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ... సిరిసిల్లను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.