ధూలేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
డైలీ భారత్, ధూలే: మహారాష్ట్రలోని ధూలే జిల్లా లాలింగ్ ఘాట్ వద్ద ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిన బహువాహన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇసుకతో వెళ్తున్న డంపర్ ట్రక్ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది.
ప్రమాదం తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రక్కులను తొలగించే పనిలో ఉండగా, నాసిక్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లగ్జరీ ట్రావెల్స్ బస్సు ఇప్పటికే ఢీకొన్న రెండు ట్రక్కులను బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుల్లో ఐదుగురు బస్సు ప్రయాణికులు కాగా, మరో వ్యక్తి లాలింగ్ టోల్ ప్లాజా ఉద్యోగి. ప్రమాదంతో హైవేపై ఒక వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నాసిక్ వైపు వెళ్లే లేన్‌కు మళ్లించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.