డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎప్పుడూ అధికారులతో సమీక్షలు, ఫైళ్లతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ ఏకంగా పెట్రోల్ బంక్ ఉద్యోగిగా మారిపోయారు! స్వయంగా వాహనాలకు డీజిల్ పోసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఆసక్తికర ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
గత కొద్ది రోజులుగా ఇంధన కొరత ఏర్పడిందంటూ, పెట్రోల్, డీజిల్ దొరకదంటూ సోషల్ మీడియాలో వదంతులు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురై, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా రంగంలోకి దిగారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - ప్రజలకు భరోసా:
సత్తెనపల్లిలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కృతిక శుక్లా.. ఒక బంకులో స్వయంగా నాజిల్ పట్టుకుని వినియోగదారుల వాహనాలకు డీజిల్ నింపారు. కలెక్టరే స్వయంగా ఇంధనం పోస్తుండటంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన ప్రకటన చేశారు.
"జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇంధన కొరత ఉందన్న వార్తలు కేవలం వదంతులు మాత్రమే. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి పానిక్ కావొద్దు. అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి ఇబ్బంది పడకండి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా రంగంలోకి దిగి చేసిన ఈ పనికి, ఇచ్చిన భరోసాకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో నిత్యావసరాల సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని అధికారులు స్పష్టం చేయడంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.