కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం...!
చెయ్యి గుర్తుకు ఓటెయ్యండి.. చేవెళ్ల అభివృద్ధికి సహకరించండి.
బీజేపీని గెలిపిస్తే కొరివితో తలగోక్కున్నట్టే
నామినేషన్ దాఖలు అనంతరం చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు మూడు అమలవుతున్నాయనీ, మిగతా వాటి అమలుకు తనదే హామీనని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, మొత్తంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసేందుకు చిత్తశు ద్దితో పని చేస్తోందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే వాటిని నూటికి నూరు పాళ్లు అమలు చేసి చూపుతామని ఆయన హామీనిచ్చారు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతు కేంద్రంలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ...దేశానికి, తెలంగాణకు, ప్రత్యేకంగా చేవెళ్లకు చేసిందేమీ లేదని రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలో కేంద్రం తెచ్చిన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు సమిధలయ్యాయని వాపోయారు. నిత్యవసర వస్తువుల ధరలతో పేదలు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేసిందని తెలిపారు. ఈ సమస్యలేవీ బీజేపీకి పట్టటం లేదని విమర్శించారు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోడీ... తన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి చాలక సీఏఏ, ఎన్ ఆర్‌సీ లాంటి చట్టాలతో మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ చోద్యం చూస్తోందని గుర్తు చేశారు. అందువల్ల చేవెళ్లలో బీజేపీకి ఓటేస్తే కొరివితో తలగోక్కున్నట్టేనని చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే... నిండా మునుగుడేనని హెచ్చరించారు. చేవెళ్ల అభివృద్ధి కావాలన్నా, మత సామరస్యంతో జనం ఆనందంగా ఉండాలన్నా... పేదల హస్తమైన కాంగ్రెస్‌కే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. చెయ్యి గుర్తుకే ఓటేసి చేవెళ్ల ఎంపీగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జగదీశ్ గౌడ్, టిపిసిసీ ప్రధాన కార్యదర్శి ఏలుగంటి మధుసూధన్ రెడ్డి,చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి పామేన భీమ్ భారత్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.