డైలీ భారత్, సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో వార్డు అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) పాత్రే కీలకమని అన్నారు.
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 39 వార్డుల వార్డు అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, బీఎల్ఏలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నా, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ పేరుతో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఛీ కొడుతున్నా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గే సభ పెట్టిన ప్రాంతాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దారుణమన్నారు. దీనికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ దళిత నాయకులు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తే, ఇక్కడ సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు దళితులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. దళితులను అవమానించిన బీజేపీ, బీఆర్ఎస్ లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న SIR ఓటర్ల జాబితా సవరణే రాబోయే ఎన్నికల భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. అక్టోబర్ 7, 2026 వరకే గడువు ఉందని, ఈ తక్కువ సమయంలోనే ప్రతి వార్డు అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలన్నారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు ఫారం నింపారా లేదా అని పరిశీలించాలని, ప్రతి పోలింగ్ బూత్ పై పూర్తి పట్టు సాధించి సిరిసిల్లలో కాంగ్రెస్ ను రెట్టింపు బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, ప్రధాన కార్యదర్శులు నీలి రవీందర్, నేదురు లక్ష్మణ్, వెంగళ అశోక్, ఉపాధ్యక్షులు శ్రీరాముల వెంకటేశం, కార్యదర్శి బైరగోని రమేష్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, నాయకులు వెంగళ లక్ష్మీ నరసయ్య, కంసాల మల్లేశం, మల్యాల నాగరాజ్, వార్డు అధ్యక్షులు ఆడపు ప్రసాద్, కొమ్ము త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.