డైలీ భారత్, రావులపాలెం: అన్ని భాషల కన్నా అమ్మ భాష మిన్న అని చాటుతూ రావులపాలెంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రగతి భారతం ట్రస్ట్ రావులపాలెం, మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి సంయుక్త ఆధ్వర్యంలో "శతక పద్య సహస్ర గళార్చన - వేమన శతకం" కార్యక్రమం ఘనంగా జరిగింది.
పట్టణంలోని చిన్నం సుబ్బిరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 20కి పైగా పాఠశాలలకు చెందిన 1008 మంది విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి 108 వేమన పద్యాలను రాగయుక్తంగా, తడబాటు లేకుండా కంఠస్థంగా ఆలపించారు. వెయ్యి గొంతులు ఒకేసారి పద్యాలను పలకడంతో సభా ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ.. వేమన చెప్పిన నీతిని ప్రతి విద్యార్థి ఆచరించాలన్నారు. వేమన పద్య పఠనం వల్ల చిన్నారుల్లో వినయం, సత్ప్రవర్తన పెంపొందుతుందని, మాతృభాషపై మమకారం పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో "అన్ని భాషల కన్నా అమ్మ భాష మిన్న" అంటూ నినాదాలు చేయించారు.
పద్య పఠనంతో పాటు 108 పద్యాలపై ప్రశ్నోత్తరాల పోటీ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రగతి భారతం ట్రస్ట్ చైర్మన్ తవనంపూడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, ట్రస్ట్ సభ్యులు డా. ఎస్. ఉమాశంకర్, డా. ఎస్. రాజకుమారి, మాతృభాష పరిరక్షణ సేవా సమితి సెక్రటరీ సివిఎస్ నాగభూషణం పాల్గొన్నారు. ముగింపు సభకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూ.గో జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఆనందరెడ్డి హాజరయ్యారు.